: బళ్లారి మైనింగ్ స్కాంలో మరో ఐఏఎస్... కర్ణాటకలో గంగారామ్ బడేరియా అరెస్ట్
కర్ణాటక అక్రమ గనుల తవ్వకాల కుంభకోణంలో మరో ఐఏఎస్ అధికారి అరెస్టయ్యారు. బళ్లారి జిల్లాలో దాదాపు 11,767 చదరపు కిలోమీటర్ల మేరకు అటవీ భూములను నిబంధనలకు విరుద్ధంగా డీ నోటిఫై చేయడమే కాకుండా, గనులను తవ్వేందుకు, ఖనిజాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతినిచ్చారన్న ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి గంగారామ్ బడేరియాను నిన్న విచారణకు పిలిపించిన కర్ణాటక సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) రాత్రి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
కాగా, గతంలో లోకాయుక్త ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో గంగారామ్ తో పాటు మరో 10 మంది ఐఏఎస్ అధికారుల పేర్లున్న సంగతి తెలిసిందే. గంగారామ్ డీ నోటిఫై చేసిన ఫైల్ వెనుక గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన కుమారస్వామి, ధరంసింగ్, ఎస్ఎం కృష్ణ తదితరుల హస్తం ఉందని లోకాయుక్త కమిటీకి నేతృత్వం వహించిన సంతోష్ హెగ్డే తన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో మైసూర్ మినరల్స్ సంస్థ డైరెక్టర్ గా ఉన్న గంగారామ్, 14,200 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతికి అనుమతిచ్చినట్టు ఆరోపణలున్నాయి.