: కమ్యూనిస్టుల్లారా.. రెచ్చిపోతే చచ్చిపోతారు జాగ్రత్త.. వామపక్షాలకు నాయిని హెచ్చరిక
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వామపక్షాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అతిగా రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే చచ్చిపోతారని అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం జరిగిన పరిణామాలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టులకు స్థానం లేదని అన్నారు. కేసీఆర్ పాలనలో ఏ సమస్యా లేకపోవడంతో ధర్నాచౌక్ వంటి చిన్న సమస్యను పెద్దదిగా చేసి రెచ్చిపోతున్నారని, అది మంచిది కాదని హితవు పలికారు.
రెచ్చిపోవద్దని, రెచ్చిపోతే ప్రజల చేతిలో చచ్చిపోతారని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో వామపక్షాలకు స్థానం లేకుండా పోయిందని, ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ తోక పట్టుకుంటే బతుకుదెరువు ఉండడం లేదని ఎద్దేవా చేశారు. మగ్ధూంభవన్‌లో దీక్షలు చేసి ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఫాసిస్టులు, నియంతలు అని తిట్టినా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అసలు ధర్నాచౌక్‌ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు.