: పోలీసు అధికారులే దుర్మార్గంగా వ్యవహరించారు: ధర్నాచౌక్ వద్ద ఆందోళనపై వామపక్షాలు
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాము ఈ రోజు అదే ప్రాంతంలో శాంతియుతంగా చేయాలనుకున్న ధర్నాను ప్రభుత్వం అణగదొక్కాలని చూసిందని వామపక్ష నేతలు విరుచుకుపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ... కాలనీ వాసుల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించింది టీఆర్ఎస్ నేతలేనని అన్నారు.
తాము అనుమతి తీసుకొనే ధర్నా చేయడానికి వచ్చామని, గుండాలు, రౌడీలు అంటూ తమపై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టబద్ధంగా, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని, గొడవలు చెలరేగకుండా చూడాలని అంతేగానీ ఇలా ప్రవర్తించకూడదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. స్థానికుల ముసుగులో మఫ్టీ పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారని తెలిపారు. పోలీసుల లాఠీ ఛార్జ్‌లో 30 మందికి పైగా గాయపడ్డారని ఆయన అన్నారు. పోలీసు అధికారులే దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు.