: పద్దెనిమిదేళ్ల కుర్రాడు రూపకల్పన చేసిన చిన్న ఉపగ్రహం ‘కలామ్ శాట్’... వచ్చే నెల 21న ప్రయోగం!
స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ బరువు ఉండే శాటిలైట్ ‘కలామ్ శాట్’ ను నాసా నింగిలోకి పంపనుంది. ‘కలామ్ శాట్’ గురించి, దాని రూపకర్త గురించి చెప్పాలంటే.. తమిళనాడుకు చెందిన పద్దెనిమిది సంవత్సరాల విద్యార్థి రిఫత్ షారూక్ దీనిని తయారు చేశాడు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘క్యూబ్స్ ఇన్ స్పేస్’ అనే పోటీని గతంలో నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్న రిఫత్ షారూక్, కార్బన్ ఫైబర్ పాలిమర్ తో అతి చిన్న శాటిలైట్ ను తయారు చేశాడు.
స్మార్ట్ ఫోన్ బరువు కన్నా తక్కువగా ఉండే ఈ శాటిలైట్ ను వచ్చే నెల 21వ తేదీన నాసా ప్రయోగించనుంది. వాలప్ప్ దీవి నుంచి ప్రయోగించనున్న ఈ అతి చిన్న ఉపగ్రహానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట ‘కలామ్ శాట్’ అని పెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి షారూక్, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, త్రీ డీ ప్రింట్ కార్బన్ ఫైబర్ పనితీరును తెలుసుకునేందుకు, అంతరిక్ష ప్రయోగాలను తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు ‘కలామ్ శాట్’ ఉపయోగపడుతుందని అన్నారు.