: నేనో చిన్న పార్టీకి చెందిన నాయకుడిని... మోదీ సమర్థవంతమైన నాయకుడు: బీహార్ సీఎం నితీశ్ కుమార్
తానో చిన్న పార్టీకి చెందిన నాయకుడినని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. తనకు జాతీయ స్థాయిలో ఆశలు లేవని స్పష్టం చేశారు. తాను తమ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంపైనే దృష్టి పెట్టానని తెలిపారు. తాను ప్రధానమంత్రి పోటీలో కూడా లేనని తేల్చిచెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని, ఆయన సమర్థ నాయకుడని నమ్మే దేశ ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని నితీశ్ ప్రశంసించారు. తనకు అంత సామర్థ్యం లేదని నిర్మొహమాటంగా చెప్పారు.
శరద్ యాదవ్ వరుసగా మూడుసార్లు జేడీ(యూ) అధ్యక్షుడిగా పనిచేశారని, ప్రస్తుతం ఆ పదవిని తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు నిర్ణయించారని నితీశ్ తెలిపారు. ఈ అంశంపై మీడియాలో మాత్రం అసత్యప్రచారం జరుగుతోందని, తాను జాతీయస్థాయి పదవులపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. జేడీ(యూ) అధ్యక్షుడిగా తమ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికే తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ప్రధాన మంత్రి పదవి కోసం తానేం తాపత్రయపడడం లేదని తేల్చిచెప్పారు.