: భార్యను దారుణంగా హత్య చేసిన భర్త... కంపచెట్లలో ఆమె తల లభ్యం!
మహారాష్ట్రలో ఇటీవలే ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ప్రియాంక గౌరవ్ అనే గృహిణి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కొన్ని రోజుల క్రితం రబలే పారిశ్రామిక వాడలో తల లేకుండా ఉండి కొంచెం కాలిపోయిన ఆమె మొండెం కనిపించింది. ప్రియాంక ఎడమ చేతిపై ఉన్న గణేశ్ ఓం అనే పచ్చబొట్టు ఆధారంగా ఈ నెల 9న ఆ మృతదేహం ఆమెదేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు గాలిస్తోన్న పోలీసులకు తాజాగా కంపచెట్లలో ఓ తల దొరికింది. అది ప్రియాంకదేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... థానేలోని షాపూర్-నాసిక్ రోడ్డులో ఈ తల భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రియాంక తలను నరికేసిన దుండగులు దానికి ప్లాస్టిక్ పేపర్లు చుట్టి ముళ్ల కంపలో పడేశారని తెలిపారు. ఆ ప్రదేశంలో ఓ బెడ్ షీట్ కూడా లభ్యమైందని, ఈ దారుణానికి పాల్పడ్డ వారిలో ఒకడైన విశాల్ సోని అనే వ్యక్తిని అరెస్టు చేశామని చెప్పారు. అనంతరం రెండు రోజుల క్రితం ప్రియాంక భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకొని విచారించగా వారే ఈ హత్య చేసి ఆమె తలను నరికివేసినట్లు తెలిసిందని పోలీసులు వివరించారు. వారు విశాల్ సోనీ, దుర్గేశ్ పత్వా అనే వ్యక్తుల సాయంతో ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు.