: ప్రెస్ మీట్ లో కుప్పకూలిన కపిల్ మిశ్రా... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
డిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతున్న వేళ, బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా కుప్పకూలారు. ఆ వెంటనే అక్కడే ఉన్న ఆయన అనుచరులు, పోలీసులు మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఆయన్ను పరిశీలించిన వైద్యులు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయిందని నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీ ప్రజల ముందు కఠిన నిజాలను ఉంచుతానని చెప్పిన ఆయన, మీడియాను పిలిచి కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలతో కూడిన స్లైడ్ షోను ప్రదర్శిస్తూ, పడిపోయారు. అంతకుముందు ఆయన ఆప్ నేతపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కపిల్ మిశ్రాకు నిపుణులైన డాక్టర్ల నేతృత్వంలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.