: విశాఖ మహానాడుకు తెలంగాణ నుంచి రెండు రైళ్లు!
ఈనెల 27న విశాఖపట్టణంలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడుకు తెలంగాణ నుంచి రెండు రైళ్లు బయలుదేరనున్నాయి. ఈ నెల 26న సాయంత్రం జగిత్యాల, హైదరాబాద్ నుంచి రైళ్లను ప్రారంభించాలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ అధికారులతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. రెండు ప్రాంతాల నుంచి విశాఖకు బయలుదేరనున్న రైళ్లలో తెలంగాణ టీడీపీకి చెందిన ముఖ్యనేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లనున్నారు. కాగా, తెలంగాణలో నిర్వహించనున్న మహానాడులో ప్రతిపాదించనున్న 9 తీర్మానాలపై చర్చించేందుకు పార్టీ ముఖ్యనాయకులు సోమవారం సమావేశం కానున్నారు.