: తెలంగాణలో మరో రాష్ట్రం కోసం ఉద్యమం.. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి
తెలంగాణలో మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని, ఆయన తీరు కారణంగా దక్షిణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం వచ్చినా రావచ్చని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా నేతలు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
డిండి, పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. అదే జరిగితే పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ తీరుతో భవిష్యత్తులో జలయుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలను విడదీసి కేసీఆర్ రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న వంశీచంద్‌రెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఖరీఫ్‌కు నీరు అందించకపోతే ఉద్యమం ద్వారా సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.