: ఇండియా సహా 100 దేశాలను విలవిల్లాడిస్తున్న వానక్రై!
షాడో బ్రోకర్స్ పేరిట హ్యాకర్స్ ఆటోమొబైల్, హాస్పిటల్స్, టెలికం, ప్రజారవాణా, విద్య, బ్యాంకింగ్ సంస్థల కంప్యూటర్లను హ్యాక్ చేస్తుండటంతో భారత్ సహా బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, ఉక్రెయిన్, చైనా, ఇటలీ, రష్యా సహా 100 దేశాలు విలవిల్లాడాయి. నిసాన్, ఫెడెక్స్, రెనో వంటి పెద్ద కంపెనీల కంప్యూటర్లలోకీ 'వానక్రై' (వాన్న డిక్రిప్టర్ ర్యాన్సమ్ వేర్) పేరిట ఉన్న ఈ వైరస్ ను చొప్పించిన హ్యాకర్లు ఒక్కో దాడికి 300 నుంచి 600 డాలర్లు ఇస్తేనే వైరస్ ను వెనక్కు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. కంప్యూటర్లలోని డేటాను తమ అధీనంలోకి తీసుకుని డబ్బిస్తేనే విడిచిపెడతామని బేరాలు చేస్తున్నారు.
అమెరికా జాతీయ భద్రతా సంస్థ వద్ద ఉన్న ఓ 'సైబర్ వెపన్' సాయంతో హ్యాకర్లు ఈ దాడికి పాల్పడగా, ఇప్పటి వరకూ జరిగిన సైబర్ దాడుల్లో ఇదే అతిపెద్దదని ఐటీ నిపుణులు వ్యాఖ్యానించారు. దీన్ని శుక్రవారం గుర్తించామని చెప్పిన యాంటీ వైరస్ సంస్థ 'అవాస్ట్' ఆపై ఇది శరవేగంగా విస్తరించి, గడచిన 24 గంటల్లో లక్షకు పైగా కంప్యూటర్లకు సోకిందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోని బలహీనతలతో ఇది వేగంగా విస్తరిస్తోందని మరో యాంటీ వైరస్ సంస్థ కాస్పరస్కీ పేర్కొంది. ఇక ఈ కనీవినీ ఎరుగని సమస్యతో ఆందోళన చెందుతున్న సైబర్ సంస్థలు, హ్యాకర్లకు డబ్బిచ్చినా డేటా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదని చెబుతుండటం గమనార్హం.