: ఒళ్లు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేస్తే మంచిది: రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల వార్నింగ్
ఖమ్మంలో నిర్వహించిన టీడీపీ రైతు దీక్షలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన తుమ్మల రేవంత్ రెడ్డి కారుకూతలు కూయకూడదని అన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని రాజకీయాలు చేస్తే మంచిదని హెచ్చరించారు. టీడీపీకి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకునే సోయే లేదని అన్నారు. మూడు గంటలు కూడా కరెంటు రాని రైతాంగానికి కోరుకున్నంత కరెంటు ఇస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణలో చెరువులన్నింటినీ బాగు చేస్తున్నామని తుమ్మల చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూసేకరణ చట్టం, తెలంగాణ పథకాలను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రైతాంగం గురించి, తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి, ఉద్యమం గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. తెలంగాణ పథకాలు చూసి పక్కరాష్ట్రాలు తమ రాష్ట్రంలోనూ ప్రారంభించాలనుకుంటున్నాయని, అటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.