: తాళికట్టు శుభవేళ వరుడి నోటి నుంచి మద్యం వాసన.. ఆ పెళ్లికొడుకు వద్దని చెప్పేసిన యువతి!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించి, దాన్ని అమలు పరుస్తుండడం పట్ల ఆ రాష్ట్ర మహిళలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. మద్యం తాగడం వల్ల తమ బతుకులు నాశనం అవుతాయని, అందుకే మద్యం తాగే వారిని పెళ్లి చేసుకోకూడదని ఆ రాష్ట్ర యువతులు ఎంతో ధైర్యంతో గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవలే బీహార్‌లో అలాంటి మందుబాబులైన ముగ్గురు వరులను పెళ్లాడేందుకు నిరాకరించిన అమ్మాయిల వార్త దేశ వ్యాప్తంగా వార్తల్లోనూ నిలిచింది. తాజాగా ఓ పెళ్లి కూతురు కూడా అటువంటి పనే చేసి మందుతాగే యువకుడికి మంచి బుద్ధి చెప్పింది. పెళ్లి పీటలవరకూ వచ్చిన తన పెళ్లిని ఆపేసి మరీ ఆ తాగుబోతుని పెళ్లాడబోనని చెప్పేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.... ఆ రాష్ట్రంలోని వైశాలీ జిల్లా హారౌలీభట్టీకి చెందిన చందన్ చౌదరి అనే యువకుడికి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. యువతి మెడలో తాళి కట్టేందుకు తన బంధుమిత్రులతో కలిసి సందడిగా పెళ్లి పందిరిలోకి వచ్చాడు. పురోహితుడు వేద మంత్రోచ్చారణలతో పెళ్లి జరిపిస్తున్నాడు. ఆ సమయంలో తన ముందు కూర్చున్న వరుడి నోట్లోంచి మద్యం వాసన రావడం గమనించిన సదరు వధువు తనకు ఆ వరుడు వద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఇక, వరుడి తల్లిదండ్రులకు ఇచ్చిన కట్నాన్ని తిరిగి తీసుకొని ఆ వరుడి కుటుంబానికి దండం పెట్టి, పెళ్లి పెద్దలు వారిని తిరిగి ఇంటికి పంపించేశారు. మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొందరు బీహారీలకు అక్రమంగా మందు, నాటు సారా దొరుకుతున్నాయి.