: ఈ సైబర్ అటాక్ చాలా స్వల్పమైనది...మాపై ప్రభావం లేదు: ఏపీ పోలీస్ బాస్
వాన్నా క్రై ర్యాన్సమ్ మాల్ వేర్ సైబర్ అటాక్ వల్ల ఏపీ పోలీస్ విభాగానికి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ రాష్ట్ర పోలీసు బాసు సాంబశివరావు ప్రకటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, వాన్నా క్రై ర్యాన్సమ్ మాల్ వేర్ ప్రపంచ వ్యాప్తంగా దాడులకు తెగబడిందని, తమ నిపుణులు దానిపై పని చేస్తున్నారని ఆయన చెప్పారు. విండోస్ ఆధారిత కంప్యూటర్లపై ఈ వైరస్ ప్రభావం చూపిందని ఆయన అన్నారు. అయితే పోలీసు విభాగం...ఆన్ లైన్ రికార్డులతో పాటు, ఆఫ్ లైన్ రికార్డులు కూడా భద్రపరుస్తుందని తెలిపారు.
దీంతో తమ డేటాకు వచ్చిన నష్టం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇంతవరకు ఉన్న డేటాను మరోసారి ఆయా పోలీస్ స్టేషన్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో ఈ డేటా డీజీపీ ఆఫీసు తో పాటు, జిల్లా కమిషనరేట్ వంటి ఆఫీసుల్లో కూడా ఉంటుందని, దానిని రికవర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ పోలీసు విభాగంపై ఈ సైబర్ అటాక్ ప్రభావం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.