: ఐపీఎల్ లో బౌలింగ్, కీపింగ్ లో 'సెంచరీ'లు చేసిన జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోనీ
బౌలింగ్, కీపింగ్ లో సెంచరీ చేయడమేంటన్న అనుమానం వచ్చిందా? అవును, వారిద్దరూ తమ విభాగాల్లో సెంచరీలు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే... జహీర్ ఖాన్ ఐపీఎల్ కెరీర్ లో వంద వికెట్లు తీసిన పదో బౌలర్ గా, 8వ ఇండియన్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. పూణేతో జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే వికెట్ తీయడం ద్వారా జహీర్ ఖాన్ వందో వికెట్ మైలు రాయిని చేరుకోగా, అతని కంటే ముందు ఈ జాబితాలో లలిత్ మలింగ (152), అమిత్ మిశ్రా (134), హర్భజన్ సింగ్ (127), పియూష్ చావ్లా (123), డ్వేన్ బ్రావొ (122), భువనేశ్వర్ కుమార్ (108), ఆశిష్ నెహ్రా (106), వినయ్ కుమార్ (101), రవిచంద్రన్ అశ్విన్ (100) లు నిలిచారు. ఇందులో మలింగ, బ్రావో విదేశీయులు కాగా, స్వదేశీ బౌలర్లదే పై చేయిగా నిలిచింది.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ ఇదే మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడం ద్వారా ఐపీఎల్ లో 100 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ధోనీ 156 ఐపీఎల్ మ్యాచుల్లో 71 క్యాచులు, 29 స్టంపింగ్స్ చేశాడు. ధోనీ కంటే ముందే ఇలా 100 వికెట్ల భాగస్వామ్యంలో పాలుపంచుకున్న మరో కీపర్ దినేష్ కార్తీక్ కావడం విశేషం!