: ఉపవాసం ఉండకపోతే జైలుకు పంపే చట్టాన్ని తీసుకొచ్చిన పాక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన బెనజీర్ కుమార్తె
పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాస దీక్షలు పాటించాలని... లేకపోతే జైలుకు పంపుతామంటూ పాక్ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ వారం ప్రారంభంలో 1980 ఆర్డినెన్స్ కు పాక్ సెనేట్ సవరణ చేసింది. రంజాన్ మాసంలో బహిరంగంగా తిన్నా, ధూమపానం చేసినా రూ. 500 జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేశారు.
పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై దివంగత పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె బఖ్తవార్ భుట్టో జర్దారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులను పొట్టనబెట్టుకుంటున్న ఉగ్రవాదులను రోడ్లపై స్వేచ్ఛగా తిరగనిస్తూ... సామాన్యులను మాత్రం జైలుకు పంపే కార్యక్రమం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోతారని అన్నారు. ఇది ఇస్లాంకు పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు.