: క్రైం సీరియల్స్ ఎఫెక్ట్: అచ్చం వాటిలో చూపించినట్లే కేజీ బంగారాన్ని దోచేసిన బాలుడు!
అతడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే, దొంగతనాలు ఎలా చేయాలనే విషయం మాత్రం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న ఆ మైనర్ బాలుడు తన తల్లి ప్రోత్సాహంతో ఇంట్లో అవసరాలు తీర్చేందుకు ఇప్పటివరకు చిన్నచిన్న దొంగతనాలు మాత్రమే చేశాడు. ఇంట్లో తన తల్లితో కలిసి ఆ బాలుడు క్రైమ్ సీరియళ్లు కూడా చూసేవాడు. అందులో దోపిడీలు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకునేవాడు. కొడుకుని సక్రమైన మార్గంలో నడిపించాల్సిన తల్లి అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొడుకు దొంగతనాలు చేసుకువచ్చిన సొమ్ముతో తిండితినేది. తాజాగా ఆ తల్లి తన కొడుకుతో చిన్న దొంగతనాలు చేస్తే ఏం లాభం లేదని, ఒకేసారి పెద్ద దొంగతనం చేయాలని, ఆ సొమ్ముతో దెబ్బకు తమ దరిద్రం వదిలిపోవాలని ప్రోత్సహించింది.
తల్లి మాటను జవదాటని వీర పుత్రుడిలా ఏదో గొప్పపని చేయడానికి వెళుతున్నట్లు వెళ్లిన ఆ మైనర్ బాలుడు ఓ ఇంట్లో కేజీ బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు తల్లీకొడుకులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలుడు గత నెల 25న హైదరాబాద్, చిలకలగూడలోని ఓ ఇంట్లోకి దొంగతనానికి యత్నించాడు. అయితే, అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వచ్చి కవాడిగూడ ప్రాంతంలో తాళం వేసున్న ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఇంటి వెనుక వైపు ఉన్న మరో ఇంటి గోడ ద్వారా లోపలకు ప్రవేశించి ఐరన్ రాడ్‌తో అల్మారా పగులకొట్టి అందులో ఉన్న కేజీ బంగారు ఆభరణాలు కాజేశాడు.
అదే సమయంలో ఆ బాలుడికి తాను చూసిన ఓ క్రైం సీరియల్ గుర్తుకొచ్చింది. అందులో చేసినట్లుగానే తానూ చేయాలని అనుకున్నాడు. ఆ ఇంట్లోనే కారం తీసుకుని ఘటనాస్థలంలో చల్లాడు. ఇలా చేస్తే పోలీసు జాగిలాలు నేరగాడి రాకపోకల్ని గమనించలేవని సీరియల్ ద్వారా నేర్చుకున్నాడు. అనంతరం తన తల్లి వద్దకు వెళ్లిన ఆ బాలుడు తాను ఎంత బంగారం దొంగిలించానో చూడమని చెప్పాడు. తల్లీకొడుకులు ఇద్దరూ కాకినాడకు వెళ్లి తమ సమీప బంధువైన టి.శ్రీనివాసరావుకు ఆ బంగారాన్ని అమ్మేశారు.
నిందితుల కోసం గాలిస్తోన్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు మాత్రం వాటిల్లో కూడా చిక్కకుండా ముందే ప్రయత్నాలు చేశాడు. వివిధ ఆటోలు మారుతూ ఆ మైనర్ బాలుడు ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫీడ్ నుంచి సేకరించిన ఫొటోలతో పాటు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం కాకినాడ, యానం ప్రాంతాల్లో గాలించారు. చివరకు మైనర్‌తో పాటు తల్లి, సమీప బంధువు ఈ రోజు వారాసిగూడ వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఎట్టకేలకు వారిని పట్టుకొని పోలీస్ స్టేషనుకి తరలించారు.