: నాలుగు సార్లు పెళ్లి చేసుకున్న ప్రేమజంట!
మతాలు వేరైనా ఆ యువతి, యువకుడి హృదయాలు కలిశాయి. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో విడిపోదామని నిర్ణయించుకున్నారు. అయితే, ఒకరిని విడిచి మరొకరు ఉండడం వారి వల్ల కాలేదు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఇళ్లల్లో నుంచి పారిపోవడం తప్పని భావించారు. చివరికి పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొని, పెళ్లి చేసుకున్నారు. ఐతే వారు ఒక్కసారి కాదు నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... అంకిత అగర్వాల్ అనే అమ్మాయి ముస్లిం యువకుడయిన రెహమాన్‌ని ప్రేమించింది. రెహమాన్ కూడా అంకితను విడిచి ఉండలేకపోయాడు.
అంకిత వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం రెహమాన్‌కి తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలంటే భయపడిపోయారు. ముస్లింలు నాలుగుసార్లు పెళ్లి చేసుకుంటారని, అది వారి సంప్రదాయంలోనే ఉందని అన్నారు. రెహమాన్ ఎక్కువకాలం తమ కూతురుతో కాపురం చేయకపోవచ్చని వాదించారు. అంతేగాక, తమ కూతురిని ముస్లిం మతంలోకి మారుస్తారని ఆందోళన చెందారు. తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకున్న ఫైజ్ రెహమాన్ ఓ ఉపాయం ఆలోచించాడు. తాను మరో స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు అంకితనే నాలుగుసార్లు పెళ్లి చేసుకుని తన ప్రేమ చిరకాలం నిలిచి ఉంటుందని చాటిచెప్పాడు.
వారిద్దరు మొదటిసారిగా స్థానిక మహాలక్ష్మీ ఆలయంలోని రామమందిరంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక వివాహ చట్టం కింద రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా హిందూ సంప్రదాయం ప్రకారం మూడోసారి, బంధు మిత్రులతో కలసి గోవా వెళ్లి అక్కడ నాలుగవ సారి ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని ఇలా వార్తల్లోకెక్కారు ఈ ప్రేమికులు. ఇప్పుడు ఆ కొత్త పెళ్లికూతురు మందిరాలకు వెళ్లి పూజలు చేసుకుంటుంటే, రహమాన్ మసీదుకి వెళ్లి ప్రార్థనలు చేసుకుంటున్నాడు. మతాలు వేరయినా కలిసి మెలసి జీవించవచ్చని నిరూపిస్తున్నారు. జన్మతః శాకాహారి అయిన అంకిత ఇప్పుడు కూడా శాకాహారిగానే వుంది.