: బలూచిస్థాన్ లో శక్తిమంతమైన బాంబు పేలుడు.. 25 మంది మృతి.. మరో 15 మంది పరిస్థితి విషమం
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఈ రోజు శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించి, 25 మంది మృతి చెందారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయని, వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ముస్తుంగ్ పట‍్టణంలోని మసీదులో జరిగిన ఓ కార్యక్రమానికి సెనేట్ డిప్యూటీ ఛైర్మన్ మౌలానా అబ్దుల్ గఫూర్ హైద్రి హాజరయ్యారని, ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఈ బాంబు పేలుడు సంభవించిందని వివరించారు.
ఈ పేలుడుతో హైద్రికి కూడా గాయాలయ్యాయని, ఆయన ప్రయాణిస్తున్న వాహనం దగ్ధమైందని చెప్పారు. బలూచిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.