: జగన్ పై కేసులున్నాయని మోదీకి కూడా తెలుసు.. ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు: బీజేపీ నేత సోము వీర్రాజు
ప్రధాని మోదీని వైసీపీ అధినేత జగన్ కలిస్తే తప్పేముందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. దేశ ప్రధానిని ఎవరైనా కలుసుకోవచ్చని ఆయన అన్నారు. జగన్ పై కేసులున్నాయని తెలిసినా... ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. జగన్ పై కేసులున్నాయన్న విషయం మోదీకి కూడా తెలుసని... ఆ విషయానికి వస్తే ఎంతో మంది నేతలపై కేసులు ఉన్నాయని, అలాగని వారందరినీ అసెంబ్లీ బయట కూర్చోబెట్టడం లేదు కదా? అని అన్నారు. వైసీపీని బీజేపీలో విలీనం చేసే అవకాశం లేదని చెప్పారు. అయితే, ఎన్నికల నాటికి ఏదైనా జరిగే అవకాశం ఉందని అన్నారు. బీజేపీపై పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేశారని... అంతమాత్రాన ఆయనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని చెప్పారు.