: బస్సులో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తికి షాకిచ్చిన అమ్మాయి!


బెంగ‌ళూరులో యువ‌తుల ప‌ట్ల పోకిరీలు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారన్న వార్త‌లు ప్ర‌తిరోజు వింటూనే ఉంటాం. యువ‌తుల‌కు ర‌క్ష‌ణ‌గా బెంగళూరు పోలీసులు ఇటీవల ‘Know your police station’ (మీ పరిధిలోని పోలిస్ స్టేషన్ తెలుసుకోండి) అనే యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా కేవ‌లం 15 నిమిషాల్లోనే ఓ వ్యక్తిని ప‌ట్టించి, ఓ యువ‌తి ఇప్పుడు అందరితో శ‌భాష్ అనిపించుకుంటోంది. అమ్మాయిల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తోన్న పోకిరీల ఆట‌లు క‌ట్టించాలంటే ఆ యువ‌తిలా చేయాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే, రద్దీగా ఉన్న‌ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని వెనుక సీటులో కూర్చున్న ఓ వ్యక్తి అసభ్యంగా తాకడం ప్రారంభించి, చికాకు తెప్పించాడు. ఇలా ప్ర‌వ‌ర్తిస్తే బాగోద‌ని ఆ యువ‌తి చెప్పిన‌ప్ప‌టికీ ఆ పోకిరీ వినిపించుకోలేదు. అదేపనిగా అలాగే ప్ర‌వ‌ర్తించాడు. దీంతో ఆ యువ‌తి  ‘Know your police station’ యాప్ ను క్లిక్ చేసి ఫిర్యాదు చేసింది.

 అంతే, 15 నిమిషాల్లో ఆ బ‌స్సు ఎక్క‌డ ఉందో క‌నుక్కున్న పోలీసులు బ‌స్సును ఆపేసి, ఆ వ్యక్తిని ప‌ట్టుకున్నారు. బ‌స్సులోని వారికి ఆ పోలీసులు ఎందుకు వ‌చ్చారో, అత‌డిని ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అర్థం కాలేదు. ఆ త‌రువాత తెలుసుకొని పోకిరీని ప‌ట్టించిన యువ‌తిని అభినందించారు. ఆ అమ్మాయి ప‌ట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మధుసూదన్ రావు (47) అని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News