: 'బాహుబలి 2'ను చూసి హాలీవుడ్‌ను మించిపోతామని అనడం బాగోలేదు: కమలహాసన్
అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘బాహుబలి-2’ సినిమాను చూడడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా కమల హాసన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసలతో పాటు ఓ విమర్శ కూడా చేశారు. ఆర్థికంగా ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు సినీ పరిశ్రమకు అవసరమని అన్నారు. ‘బాహుబలి-2’ కోసం ఆ సినిమా యూనిట్ చాలా కష్టపడిందని పేర్కొన్నారు. అయితే, బాహుబలిలోని కంప్యూటర్ గ్రాఫిక్స్ గురించి మాత్రం భిన్నంగా స్పందించారు. ఈ సినిమాను మనం ఉదాహరణగా తీసుకొని హాలీవుడ్‌ను మించిపోతామని అనడమే బాగో లేదని, దానికి తాను అంగీకరించబోనని చెప్పారు. సినిమాలు తీయడానికి మాత్రం మంచి కథలు ఉన్నాయని, గొప్ప సంస్కృతి మనకు ఉందని బాహుబలి చిత్రం నిరూపించిందని ఆయన తెలిపారు.