: హీరో విశాల్ పై హత్య బెదిరింపుల కేసు నమోదు
ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. తనను చంపుతానంటూ విశాల్ బెదిరిస్తున్నారంటూ నిర్మాత, దర్శకుడు సురేష్ కామాక్షి చెన్నయ్, వడపళనిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో విశాల్ వర్గానికి వ్యతిరేకంగా తాను పోటీ చేశానని... అంతేకాకుండా నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలి సమస్యలపై తాను గొంతు విప్పుతున్నానని... దీంతో, విశాల్ తన అభిమానులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి, బెదిరింపులకు దిగుతున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమిళ నిర్మాతల సంఘ నిర్వాహకుడు రాబిన్, విశాల్ అభిమాన సంఘ అధ్యక్షుడు కమల్ కన్నన్, మరో అభిమాని కలసి తనపై రౌడీయిజం చేశారని తెలిపాడు. అయితే, విశాల్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.