: కృష్ణమ్మకు మరో మణిహారం... ఇంకో భారీ ఆనకట్టకు చంద్రబాబు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువన మరో భారీ ఆనకట్టను నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి తెలుపుతూ, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చంద్రబాబు లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు మరెక్కడా ఆగకుండా సముద్రంలోకి వెళ్లిపోతున్నదని గుర్తు చేసిన ఆయన, దిగువన ఆనకట్ట కడితే, నీటిని నిలిపి కరవు ప్రాంతాల్లో వాడుకోవచ్చని తెలిపారు.
డెల్టా దిగువన ఉన్న రైతులకు ఆ బ్యారేజ్ నుంచి నీటిని ఇవ్వడం ద్వారా, పైనున్న నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని వెల్లడించారు. బ్యారేజికి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణానికి అనుకూలంగా ఉందని తెలిపారు. మూడు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహాన్ని నియంత్రించేలా దీన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. బ్యారేజ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో ఉందని, దాదాపు 1.7 టీఎంసీల నీటిని ఇక్కడ నిలుపుకోవచ్చని, మత్స్య సంపదను పెంచుకోవచ్చని ఈ లేఖలో చంద్రబాబు వెల్లడించారు.