: 'బాహుబలి-2' వసూళ్లు 1200 కోట్లు... మరో రికార్డు!
'బాహుబలి-2' సినిమా సిగలో ఎన్నో అరుదైన రికార్డులు వచ్చి చేరుతున్నాయి. తాజాగా మరో రికార్డు 'బాహుబలి-2' ప్రతిష్ఠను మరింత పెంచుతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన 'బాహుబలి-2'... ఇప్పుడు తాజాగా 1200 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. హిందీ వెర్షన్ లోనే 360 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'బాహుబలి-2', అమెరికాలో 100 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్రకెక్కింది.
చైనా, పాకిస్థాన్ లో కూడా భారీ విజయం సాధించిన ఈ సినిమా... భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, 1500 కోట్ల రూపాయల దిశగా సాగిపోతోంది. దీంతో ఆ రికార్డు కూడా ఎంతో దూరంలో లేదని, 2000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.