: కీలక పదవికి కన్నడ నటి రమ్యను ఎంచుకున్న రాహుల్ గాంధీ!
కాంగ్రెస్ పార్టీలో డిజిటల్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా, ఐటీ విభాగాల నిర్వహణ బాధ్యతలను కన్నడ నటి రమ్యకు అప్పగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య, మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో, దాన్ని మరింతగా పుంజుకునేలా చూడాలని భావిస్తున్న కాంగ్రెస్, ప్రస్తుతం ఆ విభాగానికి హెడ్ గా ఉన్న దీపీందర్ హూడా సరిగ్గా పనిచేయలేక పోతున్నారని పార్టీ భావిస్తోంది.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ట్వీట్లు చేస్తుండటం, దాదాపు 4.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం రమ్యకు ప్లస్ పాయింట్ అయింది. కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా కూడా మెప్పించిన ఆమెకు ఐటీ విభాగం పదవిని అప్పగిస్తే మేలు కలుగుతుందన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్, త్వరలోనే ఈ విషయమై కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.