: కడుపుకోత మిగులుస్తున్న ఖరీదైన కార్లు.. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖులు, పిల్లలు
విలాసవంతమైన కార్లు ప్రముఖుల పిల్లలను బలిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్దకాలంలో ఎందరో ప్రముఖుల పిల్లలు ఇలా మృత్యువాత పడ్డారు. సమాజంలో ఓ స్థాయి ఉండడంతో అడిగింది కాదనకుండా ఇస్తున్న తల్లిదండ్రులకు చివరికి కడుపుకోత మిగులుతోంది. తాజాగా ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మరోమారు ప్రముఖుల కుమారులపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా గతంలో కొన్ని ఘటనలను పరిశీలిస్తే..
అక్టోబరు 13, 2003లో సినీ నటుడు బాబుమోహన్ కుమారుడు పవన్ కుమార్ (26) బైక్‌పై వస్తూ తెల్లవారుజామున 5 గంటల సమయంలో జూబ్లీహిల్స్ సమీపంలో డివైడర్‌ను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. జూన్ 1, 2010లో మరో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ (39) 1000 సీసీ బైక్‌పై వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందాడు. సెప్టెంబరు 16, 2011లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ (19) ఔటర్ రింగ్‌రోడ్డుపై తన 1000 సీసీ బైక్‌తో ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఆస్పత్రిలో ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందాడు. అదే ఏడాది డిసెంబరు 20న మాజీ మంత్రి కోమటిరెడ్డి తనయుడు ప్రతీక్‌రెడ్డి (19) నార్సింగ్-పటాన్‌చెరు మధ్య కొల్లూరు సమీపంలో కారు ప్రమాదంలో మృతిచెందాడు. 2014లో నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకింరాం మృతి చెందాడు.
ఇక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నేతలను తీసుకుంటే.. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన పి.ఇంద్రారెడ్డి 1999లో ఓ పెళ్లికి హాజరై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2011లో అప్పటి మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటకు చెందిన బీజేపీ నాయకురాలు వనం ఝాన్సీ హైదరాబాద్ కు వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 2012లో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ప్రాణాలు కోల్పోయారు. 2013లో హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తూ రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎంపీ లాల్‌జాన్ భాషా మృతి చెందారు. 2014లో వైసీపీ నేత శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందారు.