: 'నా మేనమామ ఎమ్మెల్సీ' అంటూ ఎస్ఐను కొట్టాడు!
తన మేనమామ సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్సీ అంటూ ఓ ఎస్ఐ చెంప పగలగొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోన ఇటాలో జరిగింది. అతని పేరు మోహిత్ యాదవ్. అతని తండ్రికి తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ తన బంధువులలో ఒకరికి ఎక్స్ రే తీయించే విషయమై ఈ రోజు ఉదయం అక్కడి ఆసుపత్రికి వెళ్లాడు. తమకు వీఐపీ ట్రీట్ మెంట్ కావాలని, క్యూ లో నిలబడమని, వెంటనే ఎక్స్ రే తీయాలంటూ ల్యాబ్ టెక్నీషియన్ ని డిమాండ్ చేశాడు. అది కుదరదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో, ల్యాబ్ టెక్నీషియన్, డాక్టరుపై మోహిత్ యాదవ్ చేయి చేసుకున్నాడు.
దీంతో, ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహిత్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా అతను అదే తీరుతో ప్రవర్తించాడు. ‘నా పేరు మోహిత్ యాదవ్..’ అని, తన మేనమామ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అంటూ ఎస్ ఐ జితేంద్ర కుమార్ చెంపపై కొట్టాడు. మిగిలిన పోలీసులు మోహిత్ ని అడ్డుకోగా, అందులో, ఒకరి కాలర్ పట్టుకుని నానా యాగీ చేశాడు. దీంతో, అతన్ని అరెస్టు చేశామని, మోహిత్ యాదవ్ తాగినట్టు తెలుస్తోందని పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ పేర్కొన్నారు.