: ఎన్డీయే అభ్యర్థికే మా మద్దతు...రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడం మంచిది కాదు: జగన్
నూతన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికే తమ మద్దతని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీయేకు మద్దతిస్తున్నామని అన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడం తగదని ఆయన చెప్పారు. ఓడిపోతామని తెలిసినప్పుడు అభ్యర్థిని పెట్టడం ఉపయోగం లేని పని అని ఆయన అన్నారు.
ఈ విషయంలో ఎన్డీయేకు మద్దతిస్తూనే... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, భూసేకరణ బిల్లులపై పోరాడతామని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఒత్తిడి చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము ఏం చేసినా నేరుగా ముక్కుసూటిగా చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబులా వెన్నుపోటు రాజకీయాలు చేయమని ఆయన ఎద్దేవా చేశారు. మిర్చి రైతులకు క్వింటాలుకు 8 వేల రూపాయలు చెల్లించాలని కోరామని ఆయన చెప్పారు.