: బట్టతల, తెల్లజుట్టుకు కారణమిదే!
జుట్టు తెల్లబడటం, బట్టతల రావడం అనేవి నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు. ఈ కారణంగా ఎంతో మంది తీవ్ర డిప్రెషన్ కు గురవుతున్నారు. దీంతో ఈ సమస్యలకు కారణాలను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్ పరిశోధకులు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్ 20 అనే ప్రొటీన్ జుట్టు పెరుగుదల కారకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే మూలకణ కారకం (ఎస్‌సీఎఫ్) జుట్టుకి మంచి రంగును ఇస్తుందని వారు తెలిపారు. ఈ రెండూ సరిగ్గా ఉంటేనే జుట్టు మంచి రంగుతో, ఒత్తుగా పెరుగుతుందని వారు వెల్లడించారు.
దీనిని నిర్ధారించుకునేందుకు ఎలుకలపై ప్రయోగాలు చేశామని వారు తెలిపారు. మొదట కేఆర్‌ఓఎక్స్ 20 ప్రోటీన్ ను ఓ చిట్టెలుక కణాలనుంచి తొలగించి పరిశీలించగా, దాని జుట్టు పెరుగుదల వెంటనే ఆగిపోయిందని తెలిపారు. ఆ తరువాత మరో ఎలుకలో మూలకణ కారకాన్ని తొలగించగా, దాని రంగు తెల్లగా మారిందని గుర్తించారు. దీంతో ఈ రెండు కారకాలపైనే జుట్టు పెరుగుదల, రంగు ఆధారపడి ఉంటాయని వారు నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధనలు ఇక మనుషులపై చేయాల్సి ఉంటుందని వారు చెప్పారు.