: పట్టాలు తప్పిన నాందేడ్ ఎక్స్ ప్రెస్...ఇంజిన్ లో మంటలు
నాందేడ్-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. నాందేడ్ నుంచి నిజామాబాద్ కు వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు ముద్ ఖేడ్ సమీపంలోని శివాన్ గావ్ వద్ద పట్టాలపై ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ క్రమంలో ట్రైన్ ముందు భాగం పట్టాలు తప్పాయి. అదే సమయంలో ఇంజిన్ లో స్వల్ప మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అయితే సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేశారు.
దీనిపై సమాచారం అందుకున్న రైల్వే నిపుణులు, అధికారులు నిజామాబాద్ నుంచి శివాన్ గావ్ కు హుటాహుటీన తరలివెళ్లారు. రైలును మళ్లీ పట్టాలు ఎక్కించారు. దీంతో రైలు గంట ఆలస్యంగా నిజామాబాద్ కు చేరింది. రైలు పట్టాలు తప్పడంతో ఈ దారిలో వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. పట్టాలపైకి ద్విచక్ర వాహనం ఎలా వచ్చిందనే దానిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, విచారణ ప్రారంభించారు.