: ఎయిర్ వేస్ సీఈవో ప్రసంగిస్తుండగా చేదు అనుభవం!
ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఓ సమావేశంలో మాట్లాడుతున్న క్వాంటాస్ ఎయిర్ వేస్ సీఈఓ అలన్ జాయ్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఉన్నపళంగా స్టేజ్ పైకి వచ్చి, పండ్లు, మాంసం, కూరగాయలతో కలిపి తయారు చేసిన ఓ 'పై'ను అలన్ జాయ్స్ ముఖానికి రుద్ది వెళ్లిపోయాడు. అయితే, సదరు వ్యక్తి, అలా ఎందుకు చేశాడో తనకు తెలియదని చెప్పిన అలన్ జాయ్స్, స్టేజ్ పై నుండి కిందకు వెళ్లిపోయారు.
తన ముఖాన్ని శుభ్రం చేసుకుని వచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంకా ఏమైనా పైలు ఉంటే బయటకు తీయండంటూ జోక్ వేశారు. తన ముఖానికి రుద్దిన పై ఏ ఫ్లేవరో చూడలేదని, వాటిని తినే అలవాటు తనకు లేదని అక్కడి విలేకరులతో అన్నారు. కాగా, నిందితుడిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుంది.