: రవికిరణ్ చేసిన తప్పేంటో పోలీసులే తేలుస్తారు.. జగన్ ఉచ్చులో పడి ఇలాంటివారు బలవుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యే అనిత
'పొలిటికల్ పంచ్' అడ్మిన్ రవికిరణ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదు మేరకు రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తనపై అభ్యంతరకర పోస్టింగ్ పెట్టారంటూ ఫిర్యాదులో అనిత ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం కేసులు పెట్టాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని... తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు.
రవికిరణ్ చేసిన తప్పు ఏమిటో పోలీసులు తేలుస్తారని అనిత చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పన్నుతున్న వ్యూహాల్లో రవికిరణ్ లాంటివారు బాగస్వాములై, బలవుతున్నారని అన్నారు. కేవలం జగన్ వల్లే ఈరోజు రవికిరణ్ అరెస్ట్ అయ్యాడని చెప్పారు. దొంగలను నమ్ముకున్నవారి పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.