: మా పెద్దన్న, జగన్ పార్టీ నేత ఆయన...!: మేకపాటి భుజంపై చెయ్యేసి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్య
ఈ ఉదయం విజయవాడలో రైల్వే అధికారులతో సమావేశమైన అనంతరం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, పక్కనే ఉన్న వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భుజంపై చెయ్యేసి చేసిన వ్యాఖ్యలు నవ్వు పుట్టించాయి. అధికారుల్లో ఏదో చెయ్యాలన్న తపన తనకు కనిపించిందని, కానీ వారు అన్నీ చేయలేకపోతున్నారని, దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చని జేసీ వ్యాఖ్యానించారు. ధర్మవరం నుంచి విజయవాడకు కొత్త రైళ్లను అడిగామని తెలిపారు.
ఆపై మైకును మేకపాటికి అందిస్తూ, "మా పెద్దన్న... ఏమీ... ఎట్లాంటోడు ఈయన... జగన్ పార్టీ నేత ఆయన... హహహ" అన్నారు. ఆపై మేకపాటి మాట్లాడుతూ, తమ డిమాండ్లు, అవసరాలను రైల్వే అధికారులకు వెల్లడించామని, వాళ్ల సమాధానాలు దాటవేత ధోరణిలో ఉన్నాయని ఆరోపించారు. చూస్తాం, చేస్తాం, వీలుపడక పోవచ్చు వంటి సమాధానాలే వచ్చాయని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లేవనెత్తిన అన్ని అంశాలపైనా తప్పనిసరిగా స్పందించాలని తాము కోరామని అన్నారు. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.