: 3 లక్షలు ప్యాంట్ లో పెట్టి ఇస్త్రీకి ఇస్తే.. ఇలా జరిగింది!
జీన్స్ ప్యాంటులో రూ. 3.50 లక్షలు పెట్టి, ఆ సంగతిని మర్చిపోయి ఇస్త్రీ కోసం షాపు వాడికి ఇస్తే, ఆ షాపు నిర్వాహకుడు వాటిని కొట్టేసిన ఘటన హైదరాబాదు శివారు ఆల్వాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ ప్రాంతానికి చెందిన ఇమ్మడి నాగేశ్వరరావు ఎల్ఎల్ బీ చదువుతున్నాడు. 10 రోజుల క్రితం మూడున్నర లక్షల రూపాయలను తన జీన్స్ ప్యాంటులో పెట్టి బీరువాలో భద్రపరిచాడు. ఈ నెల 4వ తేదీన ఇస్త్రీ కోసం ఆ ప్యాంటును ఇస్త్రీ చేసే నాగరాజుకు ఇచ్చాడు. ఆ తర్వాత 5వ తేదీన దాన్ని తెచ్చుకున్నాడు.
6వ తేదీన ప్యాంటులో డబ్బు పెట్టిన విషయం నాగేశ్వరరావుకు గుర్తుకొచ్చింది. వెంటనే, నాగరాజు వద్దకు వెళ్లి 'ప్యాంట్ లో డబ్బు పెట్టాను, నీవు తీశావా?' అని అడిగాడు. తాను డబ్బు చూడలేదని నాగరాజు చెప్పాడు. నాగరాజుపై అనుమానం వచ్చిన నాగేశ్వరరావు ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో ప్రశ్నించగా... డబ్బు తీసుకున్నట్టు అంగీకరించాడు. ఇంటి ముందు గొయ్యి తీసి, అందులో డబ్బు పెట్టానని... రూ. 30 వేలు ఖర్చు చేశానని ఒప్పుకున్నాడు. దీంతో, నాగరాజు వద్ద నుంచి రూ. 3.20 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకుని, నాగేశ్వరరావుకు అప్పగించారు పోలీసులు.