: దమ్ముందా? అంటూ సవాల్ విసిరి... కేజ్రీవాల్ మీద కేసుపెడుతున్నానని ప్రకటించిన కపిల్ మిశ్రా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద మాజీ మంత్రి కపిల్ మిశ్రా యుద్ధం ప్రకటించారు. కేజ్రీవాల్ కు బహిరంగ లేఖ రాసిన కపిల్ మిశ్రా సవాళ్లు, ఆరోపణలు గుప్పించారు. అవినీతికి పాల్పడ్డ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. తనకు కేజ్రీవాల్ నియోజకవర్గమైనా, తన నియోజకవర్గమైనా ఒకటేనని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ కు వందిమాగధులు, ప్రత్యేక టీమ్ ఉన్నాయని, తనపై పోటీకి వారందరి సహాయ సహకారాలు తీసుకోవచ్చని ఆయన సూచించారు.
తాను మాత్రం ఒంటరి వాడినని, ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ నుంచి తాను పోరాటాన్ని నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ఈ బహిరంగ లేఖ కూడా ఆయన ఆశీర్వాదం కోసమే రాశానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ పై పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. అందుకే కేజ్రీవాల్ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ రోజే కేజ్రీవాల్ మీద కేసు పెడుతున్నానని ఆయన చెప్పారు. పార్టీ మీటింగ్ లో కేజ్రీవాల్ తన అనుచరులతో తిట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎవరేంటో తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ప్రజా కోర్టులో తేల్చుకోవాలని, అలా తేల్చుకోవాలంటే... పదవికి రాజీనామా చేసి, తనపై పోటీ చేసి, గెలవాలని ఆయన సవాలు చేశారు.