: ‘జబర్దస్త్’ ఫేమ్ వినోద్ ది కిడ్నాప్ కాదు, ఆత్మహత్యాయత్నం అంత కంటే కాదు!
'జబర్దస్త్' ఫేమ్, హాస్య నటుడు వినోద్ కిడ్నాప్ అయ్యాడని, ఆత్మహత్యాయత్నం చేశాడంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తోంది. ఇంతకీ వినోద్ ఘటనలో ఏం జరిగిందంటే... కడప జిల్లాకు చెందిన వినోద్ తల్లి శిరోమణమ్మ సోదరి లక్ష్మమ్మ కర్నూలు జిల్లాలోని సంజామల మండలంలోని బొందలదిన్నెలో నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరూ మరణించారు. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆమె పెళ్లీడుకొచ్చింది. అమ్మమ్మదగ్గర పెరుగుతున్న ఆ యువతిని వినోద్ కు ఇచ్చి చేయాలని అతని తల్లి, ఆమె సోదరి భావించారు.
ఈ నేపథ్యంలో వినోద్ ను పెద్దమ్మ లక్ష్మమ్మ నివాసానికి రప్పించి పెళ్లి చేసుకోవాలని కోరారు. వినోద్ వారి నిర్ణయంతో విభేదించడంతో... బలవంతంగా అయినా వివాహం జరపాలని భావించారు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో వినోద్ చేతికి గాయమైంది. అంతేకానీ, అతను ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలుస్తోంది. ఇక కుటుంబ సభ్యులే అతనిని బలవంతం చేయడంతో కిడ్నాప్ కూడా జరగలేదు. ఇంతలో కిడ్నాప్ అంటూ పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనాస్థలికి చేరుకోగా... తననెవరూ కిడ్నాప్ చేయలేదని, ఆత్మహత్యాయత్నం కూడా చేయలేదని వినోద్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ కు చేరడంతో వివాదం ముగిసింది.