: హైదరాబాద్‌లో మాయలేడి మ్యారేజ్ బ్యూరో.. పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్!


పెళ్లికాని యువకులే లక్ష్యంగా మ్యారేజ్ బ్యూరో తెరిచి, ఆపై వారిని మోసం చేస్తున్న మహిళను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కథనం ప్రకారం.. కాప్రాకు చెందిన శ్రీదేవి శ్రీరామ్‌నగర్ కాలనీలో సాయి శ్రీవాణి పేరుతో మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తోంది. దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తూ పెళ్లి కాని యువకులను ఆకర్షిస్తోంది. ఆమె ప్రకటనలను నమ్మి ఫోన్ చేసిన వారికి వాట్సాప్‌లో అందమైన యువతుల ఫొటోలు పంపిస్తుంది. వారితో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.

వారు డబ్బులు చెల్లించిన మరుక్షణం ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయిపోతుంది. తాజాగా శ్రీదేవి ప్రకటనను నమ్మిన మహ్మద్ నజీర్ అనే యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. శ్రీదేవి తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి అతడిని బురిడీ కొట్టింది. అనంతరం ఇద్దరు యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా అతడికి పంపించింది. వారితో మాట్లాడేందుకు రూ.9వేలు చెల్లించాలని చెప్పడంతో నజీర్ ఆ మేరకు సొమ్మును ఆమె ఖాతాలో జమచేశాడు. అనంతరం ఆమెకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గుర్తించిన నజీర్ గత నెల 26న పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం శ్రీదేవిని అరెస్ట్ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్, మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News