: ఇక్కడ సమర్థుడైన ఒక్క ఐఏఎస్ అధికారీ లేరా?: చంద్రబాబును నిలదీసిన పవన్ కల్యాణ్
దక్షిణాదిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు సమర్థుడైన ఒక్క ఐఏఎస్ అధికారి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దొరకలేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలదీశారు. ట్విట్టర్ ద్వారా టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ ను ఎందుకు నియమించాల్సి వచ్చిందో దక్షిణాది ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టడాన్ని తాను వ్యతిరేకించనని.. కానీ ఉత్తరాదిలోని అమర్ నాథ్, వారణాసి, మధుర లాంటి దేవాలయాల్లో దక్షిణాదికి చెందిన ఐఏఎస్ అధికారిని ఈవోగా నియమిస్తారా? అలా ఎందుకు నియమించడం లేదు? అలాంటప్పుడు మనం ఎందుకు వారిని నియమించాలి? అని ఆయన నిలదీశారు. కాగా, ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.