: మావోల పీచమణచడం ఎలా?: సీఎంలతో రాజ్ నాథ్ కీలక సమావేశం
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, ముఖ్యమంత్రులతో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక సమావేశం ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భోజనాలు చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డ మావోలు 26 మందిని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి మావోయిస్టును కూడా ఏరివేయాలన్న లక్ష్యంతో సాగించాల్సిన కూంబింగ్ ఆపరేషన్స్ వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని రాజ్ నాథ్ ఏర్పాటు చేశారు.
దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలన్నదే తమ నిర్ణయమని ఇటీవల రాజ్ నాథ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బీహార్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సీఎంలకు ఆహ్వానాలు అందగా, అందుబాటులో ఉన్న అందరు సీఎంలూ సమావేశానికి హాజరయ్యారు. సుక్మా దాడి తరువాత నక్సల్స్ పై అమలవుతున్న విధానాన్ని సమీక్షించడం, కొత్త నిర్ణయాలు, భద్రతా దళాలకు మరిన్ని అత్యాధునిక ఆయుధాల అందజేత తదితరాంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.