: రూ. 500 ఇస్తే, 'సూపర్ బేబీస్' ఎలా పుడతారన్న రహస్యాన్ని చెబుతామంటున్న ఆర్ఎస్ఎస్!
పెళ్లయిన ప్రతి జంటా తమకు ఆరోగ్యవంతమైన, తెలివితేటలున్న పిల్లలు పుట్టాలని కలలు కంటుంది. రూ. 500 చెల్లిస్తే, ఈ కలను నిజం చేసుకునేందుకు ఉన్న ఓ రహస్యాన్ని చెబుతామని అంటోంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఆరోగ్య భారతి. సుసంతానం కోసం తీసుకోవాల్సిన చర్యలపై 'గర్భ్ సంస్కార్' పేరిట రెండు రోజుల వర్క్ షాప్ ను తలపెట్టిన ఆరోగ్య భారతి, ఇందులో పాల్గొనే ఒక్కో జంట నుంచి రూ. 500 వసూలు చేయనుంది. ఈ వర్క్ షాప్ లో భాగంగా గుజరాత్ ఆయుర్వేద యూనివర్శిటీ విజిటింగ్ లెక్చరర్, గర్భ్ సంస్కార్ స్పెషలిస్టు డాక్టర్ కరిష్మా నార్విన్ ప్రసంగిస్తారని, పంచకర్మ స్పెషలిస్టు డాక్టర్ హితీష్ జాని తదితరులు హాజరవుతారని పేర్కొంది.
ఇక ఆరోగ్య భారతి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుసుకుని దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన 'బెంగాల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్', ఇది శాస్త్ర సమ్మతం కాదని ఆరోపిస్తూ, కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆదేశాలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, వక్తల ప్రసంగాలను వీడియో తీసి కోర్టుకు ఇవ్వాలని ఆదేశిస్తూ, వర్క్ షాప్ నిర్వహణకు అనుమతించింది.