: కిడ్నాపైన అమ్మాయిల కోసం ఉగ్రవాదులను విడిచిపెట్టిన నైజీరియా
నైజీరియాలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న తమవారిని విడిపించుకోవడానికి బోకోహరామ్ ఉగ్రవాదులు చేసిన కిడ్నాప్ విజయవంతమైంది. ప్రభుత్వం ఉగ్రవాద ప్రతినిధులతో చర్చలు జరిపి జైళ్లలోని ఉగ్రవాదులను విడుదల చేయగా, తాము కిడ్నాప్ చేసిన 200 మంది పాఠశాల అమ్మాయిల్లోని 82 మందిని బోకోహరామ్ విడుదల చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం చిబుక్ లోని పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు 200 మందికి పైగా అమ్మాయిలను అపహరించుకుపోగా, ఆపై అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో 21 మందిని విడిచిపెట్టారు.
ఆపై ఉగ్రవాదులతో నైజీరియా ప్రభుత్వం నెలల తరబడి చర్చలు జరిపింది. తాము జరిపిన చర్చలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తమ సెక్యూరిటీ అధికారులకు ఉగ్రవాదులు అమ్మాయిలను అప్పగించారని తెలిపారు. వీరిని అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్వయంగా కలుస్తారని తెలిపారు. వీరందరూ ప్రస్తుతం సైన్యం అధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్న మిగతా వారిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తాము విడిచిపెట్టిన ఉగ్రవాదుల వివరాలను మాత్రం నైజీరియా ప్రభుత్వం వెల్లడించలేదు.