: రూ.450 కోట్లు చెల్లించండి.. బీసీసీఐకి లీగల్ నోటీసు పంపిన పాక్ క్రికెట్ బోర్డు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి లీగల్ నోటీసు అందింది. రూ.450 కోట్లను తమకు పరిహారంగా చెల్లించాలని అందులో డిమాండ్ చేసింది. 2014లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత క్రికెట్ జట్టు 2015-2023 మధ్య తమతో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాల్సి ఉందని, అయితే ప్రస్తుతం ఆ ఒప్పందాన్ని బీసీసీఐ ఏమాత్రం గౌరవించడం లేదని పేర్కొంది.
తటస్థ వేదికలపై ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ బీసీసీఐ నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదని ఆరోపించింది. కాబట్టి పరిహారంగా రూ.450 కోట్లు చెల్లించాలని కోరింది. బుధవారమే ఈ నోటీసును పంపినట్టు పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ స్పందనను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.