: పన్నీర్ సెల్వానికి పెరుగుతున్న జనాదరణ... స్వరం మార్చుకున్న పళనిస్వామి!
తమిళనాట రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. అన్నాడీఎంకేలో చీలిక వర్గం నేత పన్నీర్ సెల్వం చేపట్టిన పర్యటనలకు ప్రజల నుంచి అమితమైన జనాదరణ లభిస్తుండటంతో, సీఎం పళనిస్వామి స్వరం మార్చారు. నిన్నమొన్నటి వరకూ కాస్తంత గట్టిగా ఉన్న ఆయన, నేడు చర్చలకు ఇంకా అవకాశాలు ఉన్నాయని, పార్టీ, రాష్ట్ర ప్రజల మేలు కోసం తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. పన్నీర్ సెల్వం ప్రజానాయకుడని అభివర్ణించారు. ఆయన్ను కలుపుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తమ మధ్య చర్చలు విఫలం కాలేదని, రెండు వర్గాలూ కలవడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.
కాగా, జనం ఎవరి వైపు ఉన్నారన్న విషయాన్ని పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పెట్టిన సభలు జరిగిన తీరే చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంచీపురంలో పన్నీర్ నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరు కాగా, అదే రోజు పళని నిర్వహించిన సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఇక పన్నీర్ కు పెరుగుతున్న జనాదరణను చూసే, పళనిస్వామి తాజా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. పన్నీర్ తో పేచీ పెట్టుకోవడం కన్నా కలసిపోతేనే మేలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.