: మొండి బకాయిల సమస్య మరీ అంత పెద్దదేం కాదు.. ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య
దేశంలో మొండి బకాయిల సమస్య మరీ అనుకున్నంత భయంకరంగా ఏమీ లేదని ఎస్‌బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ప్రస్తుతం మొండి బకాయిల జాబితాలో ఉన్న సంస్థలు ఇంకా చురుగ్గానే పనిచేస్తున్నాయని, ఒకసారి అవి అభివృద్ధి బాట పట్టాక బకాయిలు వసూలు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తీసుకున్న రుణానికి వడ్డీలు చెల్లించేంతగా ఆయా కంపెనీలు సంపాదించకపోవడం వల్లే రుణాలను కట్టలేకపోతున్నాయని అన్నారు.
ఆసియా అభివృద్ధి బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న అరుంధతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రుణాల ప్రక్రియ సజావుగా సాగాలంటే ఈక్విటీని తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తోందని, డిమాండ్‌కు అనుగుణంగా దానిని మలచుకోవాలని పేర్కొన్నారు. కార్పొరేట్ రుణభారం పెరగడం, కఠిన నియంత్రణల వల్ల భారత బ్యాంకింగ్ రంగం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని అరుంధతీ భట్టాచార్య పేర్కొ న్నారు.