: లోకేశ్ మంత్రయ్యాక మెసేజ్‌లు కూడా రావడం లేదు..: శ్రీమతి ఫిర్యాదు
నారా లోకేశ్ మంత్రి అయ్యాక బాగా బిజీగా మారిపోయారని, గతంలో మెసేజ్‌లతో అయినా టచ్‌లో ఉండేవారని, ఇప్పుడు అదీ లేదని ఆయన సతీమణి బ్రహ్మణి అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మామయ్య చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా, లోకేశ్ మంత్రిగా ఇద్దరూ అమరావతి అభివృద్ధిలో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారని పేర్కొన్నారు. లోకేశ్ గతంలో మెసేజ్‌లతో టచ్‌లో ఉండేవారని, కానీ మంత్రి అయ్యాక అవి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరి ముందు చాలా పెద్ద గోల్ ఉందని అన్నారు.
హెరిటేజ్ ఫుడ్స్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న తాను కంపెనీ విషయంలో అవసరమైతే మామయ్యను కానీ, లోకేశ్‌ను కానీ సలహాలు అడుగుతుంటానని తెలిపారు. సినిమాల్లో తండ్రి బాలకృష్ణ బిజీగా ఉండడంతో తమను అమ్మే పెంచిందని పేర్కొన్న బ్రహ్మణి, చదువు విషయంలో క్రెడిట్ అంతా అమ్మకే చెందుతుందని పేర్కొన్నారు. ఇంట్లో అందరూ సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించిన వారైనా చదువుకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చే వారని వివరించారు. లోకేశ్ మంత్రయ్యాక రెండు వారాలకోమారు దేవాంశ్‌ను చూస్తుంటే, మామయ్య చంద్రబాబు అయితే ఏకంగా నెలకు ఒకసారి మాత్రమే దేవాంశ్‌ను చూస్తున్నారని బ్రహ్మణి తెలిపారు.