: భర్తపై కోపం.. దాచుకున్న డబ్బంతా నమిలి మింగేసిన భార్య!
తాను దాచుకున్న డబ్బు భర్తకు చెందకూడదనే కోపంలో ఓ మహిళ ఆ నోట్లను నమిలి మింగేసిన ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. దీంతో అస్వస్థతకు గురయిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళితే... కొలంబియాకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ తన భర్తతో విహారయాత్రకు వెళ్లాలని, డబ్బుని దాచుకుంది. అయితే, ఇటీవల తన భర్తతో ఆమెకు గొడవ చెలరేగింది. దీంతో ఆమె విహారయాత్ర ప్రణాళికను రద్దు చేసుకుని, తాను దాచుకున్న డబ్బు తన భర్తకు దొరక్కుండా చేయాలని 9 వేల డాలర్లను నమిలి మింగేసింది. ఆమె కడుపులోంచి 57 వంద డాలర్ల నోట్లను బయటకు తీశామని, ఆమె కోలుకుంటోందని ఆమెకు చికిత్స అందించిన వైద్యులు తెలిపారు.