: కశ్మీర్ సమస్యను మోదీ మాత్రమే పరిష్కరించగలరు: మెహబూబా ముఫ్తీ
కశ్మీర్ సమస్యను తీర్చడం ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లే సాధ్యమవుతుందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రోజు తమ రాష్ట్రంలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మాట్లాడుతూ... మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా మద్దతుగా నిలుస్తుందని కొనియాడారు.
గత ప్రధాని పాకిస్థాన్‌లో పర్యటించాలని ఎన్నోసార్లు అనుకున్నారని, అయితే, అది ఆయనకు సాధ్యపడలేదని, కానీ మోదీ మాత్రం లాహోర్ వెళ్లివచ్చారని చెప్పారు. మోదీ సామర్థ్యానికి ఈ అంశమే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. తన తండ్రి దివంగత ముఫ్తీ మహ్మద్ సయీద్, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ కలిసి గతంలో భారత్, పాక్ మధ్య సంబంధాలను మెరుగుపరిచారని ఆమె అన్నారు. అయితే, గత సర్కారు పనితీరు సరిగా లేకపోవడంతో ఆ సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలబడలేదని అన్నారు.