: ఆడిషన్స్ పేరుతో ఇంటిని అడ్డాగా మార్చిన కన్నడ దర్శకుడి అరెస్టు
స్నేహితుడే కదా అని ఇంటిని అద్దెకు ఇస్తే... ఇష్టారాజ్యంగా వ్యవహరించి, బెదిరింపులకు దిగిన కన్నడ సినీ దర్శకుడిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే... 'కత్రిగుప్పె కట్టింగ్ షాప్' అనే సినిమా డైరెక్టర్ ప్రఖ్యాత్, తన స్నేహితుడైన పురుషోత్తమ్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో కాస్త జాగ్రత్తగా ఉన్న ప్రఖ్యాత్... తరువాత ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను ఇంటికి తీసుకువస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు.
దీంతో ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నవారు ఇబ్బంది పడి పరుషోత్తమ్ కు ఫిర్యాదు చేశారు. ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. దీంతో పురుషోత్తం ఆ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి, విధానం మార్చుకోవాలని మిత్రుడికి సూచించాడు. లేని పక్షంలో ఇంటిని ఖాళీచేయాలని హెచ్చరించాడు. దీనిపై రగిలిపోయిన ప్రఖ్యాత్ కొంతమంది రౌడీలతో పురుషోత్తంను బెదిరించాడు. దీంతో పురుషోత్తమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రఖ్యాత్ ను అరెస్ట్ చేశారు.