: మాల్దీవులు అధ్యక్షుడి ఉపన్యాసంలో ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ నినాదం.. చిరునవ్వులు చిందించిన మోదీ
‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే నినాదంతో భారత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఇదే మాట మాల్దీవులు అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ నోట నుంచి ఈ రోజు వచ్చింది. దక్షిణాసియా దేశాలకి సేవలు అందించే లక్ష్యంతో అభివృద్ధి చేసిన జీశాట్-9 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, శ్రీలంక దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాల్దీవులు అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ మాట్లాడుతూ దక్షిణాసియా దేశాలు సమన్వయంతో ఇలాగే ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. దక్షిణాసియాకు ఇది భారత్ అందించిన అద్భుతమైన కానుక అని ఆయన కొనియాడారు.
మోదీ రెండేళ్ల క్రితం సార్క్ సమావేశం సందర్భంగా ఉపగ్రహం అందిస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. భారత్ అందిస్తున్న సహకారానికి దక్షిణాసియా రుణపడి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ తో ముందుకు వెళదామని అన్నారు. ఆయన నోట ఆ మాట రాగానే మోదీ చిరునవ్వులు చిందించారు. దక్షిణాఫ్రికాలో కమ్యూనికేషన్ల వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.