: హైహీల్స్ వేసుకోవడంతో ఏకంగా ఆమె పెళ్లి రద్దయింది!


ఎత్తు తక్కువగా ఉందని భావించిన పుట్టింటివారు పెళ్లి కుమార్తె ఎత్తు పెంచేందుకు వేసిన ఎత్తుగడ వికటించి...ఏకంగా పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే....బిడది సమీపంలోని కుణిగల్ తాలూకా హొసదొడ్డి గ్రామానికి చెందిన ప్రదీప్ కు ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వధువును చూసిన వరుడు అంగీకరించడంతో వివాహాన్ని ఖాయం చేసుకున్నారు. దీంతో వీరి వివాహాన్ని రామనగర పట్టణంలోని కృష్టస్మృతి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించాలని భావించి వధువు తల్లిదండ్రులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందు రోజు రిసెప్షన్, తరువాతి రోజు వివాహం పెట్టుకున్నారు. అన్నీ సజావుగా జరిగాయి.

రిసెప్షన్ లో బంధువులు చూస్తారని, వధువు పొట్టిగా ఉందని వెక్కిరిస్తారని భావించిన కుటుంబ సభ్యులు ఆమెకు హైహీల్స్ తొడిగారు. తొలిసారిగా ఆమె హై హీల్స్ వేసుకోవడంతో ఆమె నడక మారిపోయింది. దీంతో తడబడి అడుగులు వేస్తూ కిందపడింది. దీంతో కిందపడ్డ వధువును చూసిన వరుడు ప్రదీప్ ఆమెకు మూర్ఛ వ్యాధి ఉందని, తనను మోసం కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ, ఈ పెళ్లి తనకు వద్దని వధువు కుటుంబ సభ్యులతో వాదనకు దిగాడు.

ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వివాహం రోజు కూడా ఇదే ఆరోపణలో వాదనకు దిగడంతో పెద్దలు కలుగజేసుకుని వివాహ ఖర్చులు వధువు కుటుంబానికి భారీగా అయ్యాయని, వివాహం వద్దని ముందే చెప్పి ఉంటే బాగుండేదని మండిపడ్డారు. దీంతో రెండు లక్షల రూపాయలు తాము ఇస్తామని పెద్దలతో ఒప్పందం చేసుకుని... వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వాస్తవానికి తమ కుమార్తెకు ఎలాంటి వ్యాధులు లేవని, ఎత్తుకోసం హైహీల్స్ వేస్తే అపార్థం చేసుకున్నారని వధువు తల్లిదండ్రులు, బంధువులు వాపోయారు. 

  • Loading...

More Telugu News